సాధారణంగా బీరకాయ కూర వండుకున్నప్పుడు తొక్కలను పారేస్తుంటాం. కానీ, ఆ తొక్కలతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చు. బీరకాయ తొక్కలు, టమాటాలతో కలిపి చేసే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో దశలవారీగా చూద్దాం. కావాల్సిన పదార్థాలు.. బీరకాయ తొక్కలు (3 బీరకాయలవి) టమాటాలు: 1/2 కేజీ పచ్చిమిర్చి: 10-15 (మీ కారానికి తగ్గట్టు) నూనె: 3-4 టేబుల్‌స్పూన్లు ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 1-1.5 టీస్పూన్లు) కొత్తిమీర: కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు: 6-8 జీలకర్ర: 1/2 టీస్పూను (రుబ్బడానికి), 1/2 టీస్పూను (తాలింపుకు) చింతపండు: నిమ్మకాయ సైజు అంత (నానబెట్టినది) నూనె: 1 టేబుల్‌స్పూను ఆవాలు: 1/2 టీస్పూను జీలకర్ర: 1/2 టీస్పూను పచ్చిశనగపప్పు: 1 టీస్పూను సాయి మినపప్పు: 1 టీస్పూను ఎండుమిర్చి: 1-2 (ముక్కలుగా తుంచినవి) కరివేపాకు: కొద్దిగా తయారీ విధానం.. ముందుగా బీరకాయ తొక్కలను, టమాటాలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ తొక్కలు ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కడిగి మధ్యలోకి చీల్చి పెట్టుకోవాలి. మధ్యలో ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకోవడం ముఖ్యం.
ఒక కళాయి లేదా మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టి, అందులో 2-3 టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత, శుభ్రం చేసుకున్న బీరకాయ తొక్కలను వేసి పచ్చిమిర్చితో పాటు రెండు నిమిషాల పాటు వేయించాలి. బీరకాయ తొక్కలు, పచ్చిమిర్చి కాస్త వేగాక, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేయాలి. అర కేజీ టమాటాలకు మూడు బీరకాయ తొక్కలు సరిపోతాయి. టమాటా ముక్కలు వేసిన తర్వాత, రుచికి సరిపడా ఒక స్పూను ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు పూర్తిగా మెత్తగా, గుజ్జుగా అయ్యే వరకు మీడియం మంటపై మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు పూర్తిగా మగ్గి, నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా శుభ్రంగా కడిగిన కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపివేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇది చాలా ముఖ్యమైన దశ, వేడి మీద మిక్సీ పడితే ప్రమాదం. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు (6-8), అర స్పూను జీలకర్ర, చల్లారిన టమాటా-బీరకాయ మిశ్రమం, ముందుగా నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజు చింతపండు (పులుపుకు తగ్గట్టు), మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా లేదా మీకు నచ్చిన విధంగా కాస్త పలుకుగా రుబ్బుకోవాలి. ఒక చిన్న కళాయిని పొయ్యి మీద పెట్టి, ఒక టేబుల్‌స్పూను నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. పప్పులు ఎర్రగా వేగిన తర్వాత, ఈ తాలింపును ముందుగా రుబ్బుకున్న పచ్చడిలో వేసి బాగా కలపాలి. రుచికరమైన బీరకాయ తొక్కల పచ్చడి సిద్ధం. దీనిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలిపి తింటే ఆ రుచే వేరు. ఈ పచ్చడిని చేసుకుని ఎలా ఉందో చిన్న కామెంట్ ద్వారా తెలియజేయగలరు.




