బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటి సమస్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాగడానికి నీళ్లు లేకపోగా… స్నానం చేస్తే చర్మవ్యాదులు వస్తున్నాయని ఆరోపించడం చర్చనీయాంశమైంది. గత కొంత కాలం నుంచి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో వాటర్ వర్రీ కంటిన్యూ అవుతూ వస్తోంది. దీంతో విద్యార్థులకు సెలవులు కూడా ఇచ్చారు. సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు క్యాంపస్ వచ్చారు. గత నాలుగు రోజులుగా ట్యాప్స్ నుంచి మట్టి, మడ్డితో కూడిన కలుషిత నీరు వస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఆ నీటిని వాడటం వల్ల పలువురు విద్యార్థుల చేతులు, మెడతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో దురద, అలర్జీ, దద్దుర్లు వస్తున్నాయని వాపోతున్నారు. అలాగే… ఈ నీటి సమస్య తీవ్రత విద్యార్థుల క్లాసులపైనా పడింది. కేవలం మూడు తరగతులకే మాత్రమే క్లాసులు నిర్వహిస్తుండటం విద్యార్థుల ఆందోళనకు కారణమైంది. సస్పెండ్ చేస్తాంటూ బెదిరింపులు.. మరోవైపు… సురక్షితమైన తాగునీరు అందించాలని కోరితే సంబంధిత అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను బయటకు చెబితే సస్పెండ్ చేస్తామని భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం మంచినీరు అందించలేని అధికారులు, సమస్యను ప్రశ్నించే విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. సిబ్బంది మాత్రం మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నారని వాపోతున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ పరిస్థితిపై నిర్మల్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్లో సరఫరా అవుతున్న నీటి నాణ్యతను పరీక్షించి, విద్యార్థులకు వెంటనే సురక్షితమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
