న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఢిల్లీలోని నాంగ్లీ విహార్‌లో దాస్ గార్డెన్ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాలుడి ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహా పలు విభాగాల బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్ అనే నాలుగేళ్ల బాలుడు తన తల్లితో కలిసి పార్కులో ఆడుకుంటున్నాడు.

ఈ క్రమంలో టాయిలెట్‌కు వెళ్లేందుకు డ్రైనేజీ ప్రాంతం సమీపానికి వెళ్లాడు. అయితే అక్కడ మ్యాన్‌హోల్‌పై ఏర్పాటు చేసిన ఫైబర్ కవర్ అకస్మాత్తుగా విరిగిపోవడంతో బాలుడు అందులో పడిపోయాడు. కళ్ల ముందే కుమారుడు మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో తల్లి పెద్దగా కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA), బీఎస్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

పలు ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు బాలుడి ఆచూకీ లభించలేదు. మరోవైపు తన కుమారుడు ఇమ్రాన్ తిరిగి వస్తాడనే ఆశతో తండ్రి ఖుర్షీద్ ఆలం ఎదురుచూస్తున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..