తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. తెలంగాణ చలి పెరగగా.. ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి, తర్వాతి 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడి, ఈ నెల 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అంచనావేశారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పలు తుఫాన్లతో పంట నష్టపోయిన రైతన్నలు ఈ వర్షాల వార్తతో ఆందోళన చెందుతున్నారు. ద్రోణి ప్రస్తుతం వాయవ్య ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. కోస్తాకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వర్ష సూచన చేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఇక ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి..
రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14.7 నుండి 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో 14.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయవేళల్లో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున.. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
